-
-
By LALAM NARESH
Updated :
20 November 2025 05:16 PM
అమరావతి: నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుల ఆర్థిక లావాదేవీలపై సిట్ దృష్టి సారించింది. అద్దేపల్లి సోదరుల బ్యాంకు స్టేట్మెంట్లను సేకరించి క్షుణ్నంగా విచారిస్తోంది. మాజీ మంత్రి జోగి రమేష్, అతని సోదరుడు రాములతో ఆర్థిక బంధంపై దృష్టి పెట్టింది. అద్దేపల్లి జనార్దనరావు, జగన్మోహన్రావులను సిట్, ఎక్సైజ్ అధికారులు.. రెండో విడత కస్టడీకి తీసుకున్నారు. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా బుధవారం తొలి రోజు... నెల్లూరు కారాగారంలో ఉన్న జనార్దనరావు (ఏ1)ను ఉదయం అదుపులోకి తీసుకుని.. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ తరలించారు. విజయవాడ జైలులోని జగన్మోహన్రావును కస్టడీకి తీసుకున్నారు. వీరిని తూర్పు ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించి, అక్కడ విచారించారు.
ప్రతి లావాదేవీపై ఆరా: కొన్నేళ్ల బ్యాంకు స్టేట్మెంట్లను తెప్పించి.. పెద్ద లావాదేవీలపై ఇద్దరినీ వేర్వేరుగా ప్రశ్నించారు. నగదు ఎందుకు డ్రా చేశారు? ఎవరికి ఇచ్చారు? ఎందుకు ఇచ్చారనే వివరాలను రాబట్టారు. జోగి సోదరులకు తాము ముడుపులను నగదు రూపంలోనే ఇచ్చామని అంగీకరించినట్లు తెలిసింది. అక్రమ మద్యం, నకిలీ మద్యం వ్యాపారం కోసమే జోగి రమేష్‌కు ఇచ్చామని వీరు విచారణలో తెలిపారు. జోగి సోదరులతో సంబంధాలపైనా ప్రశ్నించినట్లు సమాచారం. గతంలో తాము కలిసే మద్యం సిండికేట్‌లో సభ్యులుగా ఉండి వ్యాపారం చేసినట్లు ఒప్పుకొన్నారు. పలు ప్రశ్నలకు జనార్దనరావు సరైన సమాధానాలు చెప్పలేదు. స్పిరిట్, సీసాల కొనుగోలు, లేబుళ్ల ముద్రణ ఆర్డర్లకు నిధులు ఎలా సమకూరాయని ప్రశ్నించగా.. సమాధానాలు సూటిగా చెప్పలేదు.