-
-
By LALAM NARESH
Updated :
20 November 2025 05:15 PM
విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: లాస్ ఏంజిల్స్‌లో 2028లో జరిగే ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నానని ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ పసిడి పతక విజేత, ఒలింపియన్ బొమ్మదేవన ధీరజ్ చెప్పారు. ఢాకాలో ఘన విజయం తర్వాత విజయవాడకు వచ్చిన ధీరజ్.. ఈ పతకాన్ని తన దివంగత గురువు చెరుకూరి లెనిన్‌కు అంకితం చేసినట్లు ప్రకటించాడు. బుధవారం నగరంలోని చెరుకూరి ఓల్గా వీఎంసీ ఆర్చరీ అకాడమీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న అంతర్జాతీయ ఈవెంట్ల కోసం భారత్ జట్టులో స్థానం దక్కించుకోవడానికి శిక్షణ పొందుతున్నానన్నాడు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరిగే జాతీయ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్షిప్, వచ్చే ఏడాది టోక్యోలో జరిగే ఏషియన్ గేమ్స్‌కు సన్నాహాలపై తన దృష్టి ఉందన్నాడు. ఆసియా ఛాంపియన్షిప్ సెమీ ఫైనల్లో కొరియాపై విజయం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో పతకాన్ని తప్పక గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు. 2027లో జరిగే ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కూడా పాల్గొనాలని ఉందన్నారు. ఆసియా గేమ్స్‌కు భారత జట్టులో తన స్థానాన్ని భద్రపర్చుకోవడానికి దిల్లీలో జరిగే మొదటి ట్రయల్స్‌లో తలపడాల్సి ఉందన్నాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత రికర్వ్ జట్టులో నాల్గవ స్థానంలో నిలిచానన్నాడు. ప్రస్తుతం పురుషుల రికర్వ్ ఆర్చరీలో దేశంలో నంబరు 1వ స్థానం, ప్రపంచంలో 13వ స్థానంలో ఉన్నానన్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌ల నాయకత్వంలో ఆర్చర్లకు మెరుగైన ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ముందుగా తన గురువైన లెనిన్‌కు నివాళులర్పించి అనంతరం అకాడమీ చీఫ్ కోచ్ సత్యనారాయణ నుంచి ఆశీర్వాదాలు పొందాడు. అంతర్జాతీయ యువ ఆర్చర్లు డాలీ శివాని, యుక్తశ్రీలు ధీరజ్‌కు సాదర స్వాగతం పలికారు. చీఫ్ కోచ్ సత్యనారాయణ.. ఆసియా ఛాంపియన్షిప్ కాంపౌండ్ ఆర్చరీలో మరో పసిడి పతక విజేత వెన్నం జ్యోతి సురేఖను అభినందించారు. రాష్ట్ర ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, ఉపాధ్యక్షుడు శ్రావణ్‌కుమార్, జిల్లా సంఘం కోశాధికారి ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు