-
-
By LALAM NARESH
Updated :
20 November 2025 05:10 PM
గుంటూరు నుంచి రాజధాని ప్రాంతానికి వెళ్లే మార్గంలో తాడికొండ నుంచి తుళ్లూరు వరకు రోడ్డు అత్యంత దారుణంగా తయారైంది. ప్రధానంగా పెదపరిమి-తుళ్లూరు మధ్య భారీ గోతులతో కార్లు కూడా వెళ్లలేని పరిస్థితి. గుంటూరు నుంచి తాడికొండ మీదుగా రాజధానికి వెళ్లే మార్గం కావడంతో వీఐపీలతోపాటు రద్దీ ఎక్కువ. రోడ్డును బాగు చేయాల్సిన యంత్రాంగం జాప్యం చేస్తోంది. వాహనదారులకు నరకం చూపిస్తోంది. భారీ గోతులు పూడ్చడానికి రూ.70 లక్షలతో పెదపరిమి-తుళ్లూరు మధ్య పనులు చేపట్టిన అధికారులు.. రోడ్డులో సగం తవ్వేశారు. దీంతో రెండువైపులా రాకపోకలు సాగించాల్సిన వాహనాలకు ఒకటే మార్గం ఉండడంతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. 30 నిమిషాలకుపైగానే ఆగిపోవాల్సి వస్తోంది. పోలీసులు ఉంటున్నా.. వాహనాలు కదలడానికి ఎక్కువ సమయం పడుతోంది. మంగళవారం ఉదయం ఇసుక లోడుతో వెళ్తున్న లారీ సగం రోడ్డులో మార్జిన్లో ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. అదే సమయంలో గుంటూరు నుంచి హైకోర్టుకు వెళ్తున్న న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ వాహనం ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. అధికారులు వెంటనే పరిస్థితిని చక్కబెట్టలేకపోవడంతో వాహనాన్ని తుళ్లూరు వైపు నుంచి తీసుకురావాలని చెప్పి ఆయన హైకోర్టుకు వెళ్లారు. వీవీఐపీలు తిరిగే మార్గంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం గమనార్హం.