-
-
By LALAM NARESH
Updated :
20 November 2025 05:00 PM
శ్రీశైలం ఆలయం: శ్రీశైల మహాక్షేత్రంలో దర్శనానికి వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదాలు ఇవ్వాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. కమాండ్ కంట్రోల్ హాల్లో బుధవారం ధర్మకర్తల మండలి ఛైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో ఈవో ఎం.శ్రీనివాసరావు, ధర్మకర్తలు, ప్రత్యేక ఆహ్వానితులు సమావేశమయ్యారు. 14 అంశాలను అజెండాలో పెట్టి చర్చించారు. 11 అంశాలను ఆమోదించినట్లు ఛైర్మన్ వెల్లడించారు. 2 అంశాలు వాయిదా వేసి, ఒక అంశాన్ని తిరస్కరించినట్లు చెప్పారు. ఛైర్మన్ మాట్లాడుతూ..రూ.500 స్పర్శ దర్శనం టికెట్‌పై 100 గ్రాముల రెండు లడ్డూలు, రూ.300 టికెట్‌పై 100 గ్రాముల ఒక లడ్డూను ఉచితంగా భక్తులకు ఇవ్వాలని తీర్మానం చేసినట్లు చెప్పారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానున్నట్లు వెల్లడించారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని కొలనుభారతి అమ్మవారి ఆలయాన్ని శ్రీశైల దేవస్థానం దత్తత తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోని శ్రీగోకులాన్ని మరింత అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. స్థానిక చెంచులకు నెలలో ఒక రోజు శ్రీమల్లికార్జునస్వామి స్పర్శ దర్శనానికి ఉచితంగా అనుమతించనున్నట్లు చెప్పారు. కేంద్ర విచారణ కార్యాలయంలో గదులు, దర్శనం టిక్కెట్ల వివరాలు తెలిసే విధంగా డిజిటల్ డిస్ప్లేలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. భక్తుల ఫిర్యాదుల లేఖలు వేసేందుకు సీఆర్ఓ కార్యాలయం వద్ద బాక్స్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.