-
-
By LALAM NARESH
Updated :
20 November 2025 04:45 PM
ధర్మవరం : వ్యవసాయాభివృద్ధి, రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బుధవారం గొట్లూరు గ్రామంలో అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ కార్యక్రమం నిర్వహించారు. మంత్రితోపాటు ఎంపీ బీకే పార్థసారథి, నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 38,933 మంది రైతులకు రూ.26.29 కోట్ల మెగా చెక్కును వారు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ రైతులను గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్లపాటు నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నారన్నారు. ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలన్నారు. ఆతర్వాత పరిటాల శ్రీరామ్, మధుసూదన్‌రెడ్డి మాట్లాడారు. జేడీఏ రామునాయక్, ఏడీఏ లక్ష్మానాయక్, మార్కెట్‌యార్డు ఛైర్పర్సన్ అరుణశ్రీ, వైస్‌ఛైర్మన్ అయ్యప్ప, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కాటమయ్య, జడ్పీ మాజీ ఛైర్మన్ ఓబిరెడ్డి, గొట్లూరు సొసైటీ ఛైర్మన్ రామాంజనేయులు, తెదేపా నియోజకవర్గ క్లస్టర్ ఇన్‌ఛార్జి మహేష్ చౌదరి, శ్రీనివాసులు, భాజపా మండల అధ్యక్షుడు గొట్లూరు చంద్ర పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలో పీఎంకిసాన్-అన్నదాత సుఖీభవ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం 5,40,682 మంది రైతులకు రూ.367.68 కోట్లు నిధులు మంజూరు చేశారు.