-
-
By Chowdary
Updated :
14 November 2025 02:28 PM
రాజమహేంద్రవరం, నవంబరు 13: గోదావరి పుష్కరాలు- 2027ను సమర్ధవంతంగా నిర్వహించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల విధులు, బాధ్యతలు, అవసరమైన మౌలిక సదుపాయాలపై విభాగాల వారీగా నిర్దిష్టమైన అంచనాలు రూపొందించి, వాటిని సమగ్రంగా క్రోడీకరించి రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో జిల్లా యంత్రాంగం తరపున సమగ్ర ప్రెజెంటేషన్ రూపంలో ప్రదర్శించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో గోదావరి పుష్కరాలు -2027 నేపథ్యంలో ప్రాథమిక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సమక్షంలో గోదావరి పుష్కరాలు 2027 కార్యాచరణ ప్రణాళిక అందచేసే క్రమంలో జిల్లా ప్రజా ప్రతినిధులు, ఇంచార్జి మంత్రి ఆధ్వర్యంలో వారి సూచనలు, సలహాలను అధికారులు చేసిన ప్రతిపాదనలతో సమన్వయం చేసుకోవలసి ఉందన్నారు. ఇందుకు సంబంధించిన సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో గత పుష్కరాల సమయంలో ఏర్పడే భారీ జనసమ్మర్ధం, రవాణా సౌకర్యాలు, భద్రత, శానిటేషన్, నీటి సరఫరా, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై విభాగాల వారీగా చర్చించినట్టు తెలిపారు. అదే విధంగా రానున్న గోదావరి పుష్కరాలు 2027 సమర్థవంతంగా నిర్వహించే క్రమంలో శాఖల మధ్య సమన్వయం అత్యవసరమని అన్నారు. ఈ నేపథ్యంలో గురువారం నిర్వహించిన సమావేశంలో రెవెన్యూ, పోలీసు, ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ తదితర శాఖలు తమ విభాగాల ప్రాథమిక కార్యాచరణ, బాధ్యతలు, అవసరమైన మౌలిక సదుపాయాల వివరాలను పీపీటీల ద్వారా సమగ్రంగా వివరించాయి. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ రానున్న సమావేశాల్లో ఇరిగేషన్, దేవదాయ, రైల్వే, రవాణా, విద్యుత్తు, మున్సిపల్ శాఖలు 2003, 2015 పుష్కరాల అనుభవాలను ఆధారంగా తీసుకుని తమ విభాగాల డేటా, ఎదుర్కొన్న సవాళ్లు, భవిష్యత్తు ప్రణాళికలు సమర్పించవలసి ఉందన్నారు. 2027 పుష్కరాల నిర్వహణలో స్మార్ట్ మానిటరింగ్, ఐసీసీసీ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్, ఏఐ టెక్నాలజీ, డిజిటల్ ఇన్వెంటరీ సిస్టమ్ వంటి ఆధునిక పద్ధతులు కీలకమన్నారు. కొవ్వూరు, రాజమహేంద్రవరం ఇరు ప్రాంతాల్లో పుష్కర స్నానాలు ఆచరించే క్రమంలో భక్తుల సంఖ్య ముందస్తు అంచనా వెయ్యడం జరగాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ డైవర్షన్, పార్కింగ్, క్రౌడ్ నిర్వహణ విషయం లో రవాణా, ఇతర వ్యవస్థలు పోలీసు యంత్రాంగంతో కలిసి పని చేయడం ముఖ్యం అన్నారు.
తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక వైభవం, సంప్రదాయ విధానాలు, గోదావరి పుష్కరాలకు సంబంధించిన విశిష్ట ఆచారాలు, చారిత్రక నేపథ్యం వంటి అంశాలను సమగ్రంగా ప్రతిబింబించేలా దేవదాయ, సాంస్కృతిక శాఖలు ఏర్పాట్లు చేయాలని , ఆ మేరకు ప్రతిపాదనలను సంబంధిత విభాగాల అధికారులను సిద్ధం చెయ్యాలని ఆదేశించారు. జిల్లా యొక్క సాంస్కృతిక ప్రతిభ, సంప్రదాయ కళారూపాలు, పుణ్యక్షేత్రాల వైశిష్ట్యం ప్రజలకు తెలియజేయడం ద్వారా గోదావరి ఆధ్యాత్మికతను మరింతగా వెలుగులోకి తేవాలని కలెక్టర్ సూచించారు.
జిల్లా ఎస్పీ డీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, జన సమూహాల పర్యవేక్షణ వంటి అంశాలపై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని తెలియజేశారు. ప్రధాన ఘాట్ల వద్ద సీసీ టీవీ కెమెరాలు, ఏఐ ఆధారిత డెన్సిటీ ట్రాకింగ్ సిస్టమ్, డ్రోన్ పర్యవేక్షణ, స్మార్ట్ పేట్రోలింగ్ పాయింట్లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలల్సి ఉంటుందన్నారు. పుష్కరాల సమయంలో వివిధ ప్రభుత్వ శాఖలు, రక్షణ విభాగాలు, పోలీసు, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్ శాఖలు మధ్య సమన్వయంతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ (ఐసీసీసీ) ద్వారా సమాచారం పంచుకునే విధంగా సమగ్ర మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కేపీఎంజీ కన్సల్టెన్సీ ఏజెన్సీ ప్రతినిధులు ప్రకాశ్ శ్రీవాత్సవ్, ప్రశాంత్ తదితరులు మహా కుంభమేళా -2025 (ప్రయాగ్రాజ్)లో అమలు చేసిన స్మార్ట్ క్రౌడ్ మేనేజ్మెంట్, వాహన చలనం, పార్కింగ్, శానిటేషన్, డిజిటల్ కమ్యూనికేషన్, ఐసీసీసీ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థల అమలు విధానాలను వివరించడం జరిగింది. గోదావరి పుష్కరాల సందర్భంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా టెక్నికల్ లేఅవుట్, మోడల్ ప్రణాళిక అందించనున్నట్లు తెలియజేశారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, అదనపు ఎస్పీ మురళీ కృష్ణ, ఆర్డీవోలు రాణి సుస్మిత, కృష్ణ నాయక్, డీఎస్పీ దేవకుమార్, రైల్వే, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్, మున్సిపల్, ఆర్టీసీ, ఆర్ఎంసీ, జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.