-
-
By Chowdary
Updated :
20 November 2025 02:30 PM
తాళ్ళరేవు (మనసులో మాట), నవంబరు 20: తాళ్ళరేవు జడ్పిటిసి సభ్యుడు, క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొమ్మేటి సామ్యూల్ సాగర్ మతసామరస్యాన్ని చాటి చెప్పారు. తాళ్ళరేవు బైపాస్ రహదారిలో వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామి వారి ఆలయంలో ఆయన అయ్యప్ప స్వాములకు ఉచితంగా బిక్షను ఏర్పాటు చేశారు. గత నెల రోజులుగా ఆలయంలో నిర్వహిస్తున్న స్వాముల ఉచిత అన్నదాన పథకంలో భాగంగా గురువారం అయ్యప్ప స్వాములకు భోజనాలు ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా తానే స్వయంగా స్వాములకు భోజనాలు వడ్డించి అందరి మన్ననలు పొందారు. క్రైస్తవ మతానికి చెందినవారైనప్పటికీ హిందూ బంధువులైన అయ్యప్పలకు అన్నదానాన్ని నిర్వహించడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సామ్యూల్ సాగర్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమంలో తాను భాగస్వాముడిని కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తాళ్ళరేవు మండలంలో అన్ని మతాలు కులాలు వారు ఎంతో ఐక్యతతో జీవిస్తున్నారని, మన దేశ సిద్ధాంతమైన భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపణగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు దొమ్మేటి సత్యనారాయణ, కందికొండ భాస్కర శర్మ, నాయకులు చిట్టూరి చలపతి, పెట్ల సూర్యనారాయణ రాజు, పితాని బాల వెంకటరమణ, సంగాడి వి ప్రసాద్, సూరిబాబు రాఘవ తదితరులు పాల్గొన్నారు.