-
-
By Chowdary
Updated :
20 November 2025 10:35 AM
ప్రస్తుతం భారత్ జనాభా 146 కోట్లు. దాదాపు శతాబ్దం చరిత్ర ఉన్న ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మన దేశం ఒక్కసారీ ఆడింది లేదు. కానీ భారత్‌లో ఒక చిన్న పట్టణంతో సమానంగా జనాభా ఉన్న ఓ దేశం వచ్చే ఏడాది సాకర్ ప్రపంచకప్‌లో బరిలోకి దిగనుంది. ఆ దేశమే.. క్యురసావ్. ఈ కరీబియన్ దీవి జనాభా కేవలం లక్షా 56 వేలు. అలాంటి బుల్లి దేశం.. అత్యంత కఠినమైన అర్హత ప్రక్రియ ఉండే ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ముందంజ వేసింది. ఈ మెగా టోర్నీలో ఆడబోతున్న అత్యంత చిన్న దేశం ఇదే. ఇప్పటిదాకా ఈ రికార్డు ఐస్లాండ్ పేరిట ఉండేది. 3,50,000 జనాభా ఉన్న ఆ దేశం 2018 ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. ఆ రికార్డును ఇప్పుడు క్యురసావ్ బద్దలు కొట్టింది. ఈ రికార్డు ఎప్పటికీ అలాగే నిలిచిపోయినా ఆశ్చర్యం లేదు.
నెదర్లాండ్స్ కింగ్డమ్లో భాగమైన క్యురసావ్.. ప్రపంచకప్‌లో ఆడబోతుండడంలో డచ్ దేశం పాత్ర కీలకం. ఒకప్పుడు వివిధ వయసు విభాగాల్లో నెదర్లాండ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అరడజను మంది ఆటగాళ్లు.. ఇప్పుడు క్యురసావ్కు ఆడుతున్నారు. క్యురసావ్లో సరైన ఫుట్‌బాల్ మైదానాలు, సౌకర్యాలు లేవు. అయినా ఆ దేశ ఆటగాళ్లు వేరే దేశాల్లో సాధన చేస్తూ, క్లబ్‌లకు ఆడుతూ నైపుణ్యం సంపాదించారు. వీళ్లందరిలో జట్టు భావన తీసుకొచ్చి తీవ్రమైన పోటీ ఉండే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో ముందుకు తీసుకెళ్లడమే అసలైన సవాల్. ఆ పనే చేశాడు డచ్ కోచ్ డిక్ అడ్వొకాట్. ఆయన వయసు 78 ఏళ్లు కావడం విశేషం. కోచ్‌గా అడ్వొకాట్కు సుదీర్ఘ చరిత్రే ఉంది. 1994 ప్రపంచకప్‌లో కోచ్‌గా నెదర్లాండ్స్‌ను క్వార్టర్స్‌కు తీసుకెళ్లిన అడ్వొకాట్.. 2006 ప్రపంచకప్‌లో దక్షిణ కొరియాకు మేనేజర్‌గా పని చేశాడు. అతడి శిక్షణలోనే అమెరికా కూడా ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. ఇప్పుడు అతడి మార్గనిర్దేశంలో క్యురసావ్ ఈ మెగా టోర్నీకి బెర్తు సంపాదించింది. అయితే ఆ జట్టుకు ప్రపంచకప్ బెర్తు ఖరారైన మ్యాచ్‌లో కోచ్ అందుబాటులో లేడు. కుటుంబ కారణాలతో అతను స్వదేశానికి వెళ్లిపోయాడు.
కోచ్ లేకపోయినా.. తన కంటే మెరుగైన జమైకాను నిలువరించగలిగింది క్యురసావ్. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ 0-0తో డ్రా అయింది. మ్యాచ్‌లో ఎక్కువగా జమైకా ఆధిపత్యమే సాగింది. స్టాపేజ్ టైంలో ఆ జట్టుకు పెనాల్టీ కూడా వచ్చింది. అయితే వీడియో రివ్యూ తర్వాత రిఫరీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. లేదంటే క్యురసావ్ కథ ముగిసేది. అంతకుముందు బెర్ముడాపై 7-0తో భారీ విజయం సాధించడంతో జమైకాపై ఒక పాయింట్ ఆధిక్యంలో నిలిచింది క్యురసావ్. కాబట్టే చివరి మ్యాచ్ డ్రా అయినా ఆ జట్టు ముందంజ వేయగలిగింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైన భారత్ దశాబ్దాలుగా ఎంత ప్రయత్నిస్తున్నా ప్రపంచకప్‌నకు అర్హత సాధించడం లేదు. అర్హత ప్రమాణాలకు దగ్గర్లో కూడా వెళ్లట్లేదు. అలాంటిది కొంచెం సర్దుకుంటే నరేంద్ర మోదీ స్టేడియంలో పట్టేంత జనాభా ఉన్న దేశం ఈ టోర్నీకి అర్హత సాధించడం అద్భుతమే కదా!