-
-
By Chowdary
Updated :
11 December 2025 11:07 AM
నేను ఇంటర్ చదివే రోజుల్లో గుంటూరు కొరిటెపాడులో ఉండేవాణ్ణి. గదిలో నాతో పాటు ఇంకో నలుగురు చేరారు. అన్నం వండటం తేలికే గానీ కూర చేయడం మాత్రం కష్టమనిపించేది. కుక్కర్ యాడ్లో చూపినట్లు తరిగిన కూరగాయముక్కలు సిద్ధంగా ఉంటే వంట తేలికే! కానీ మార్కెట్లో పుచ్చుల్లేని కూరగాయలు కొనడం, వాటిని కడగటం, ముక్కలు కోయటం, తాలింపులో వేసిన దగ్గర్నుంచీ కూర ఉడికిందా లేదా అని మాటికీ చూడటం.. ఎంత విసుగు! ఒకసారి చెయ్యి తెగుతుంది, ఇంకోసారి కాలిపోతుంది. కారం పేచీ లేదు కానీ ఉప్పు ఎక్కువౌతుందేమోనని ఎప్పుడూ కంగారే. ఇన్ని కష్టాలు పడినంతలో కూర కుదురుతుందన్న గ్యారంటీ లేదు. మాడటం, ఉడకకపోవటం, ఉప్పు ఎక్కువో తక్కువో అవడం.. ఎప్పుడూ ఏదో ఒక తంటా. ఇక ఇష్టం ఎగిరిపోయి కష్టంగా తినేవాళ్లం. అంతటితో అవుతుందా? తిన్న తర్వాత అంట్లు కడగాలి. అదింకా బద్ధకం. రోజుకొకరు పాత్రలు శుభ్రం చేయాలన్నది రూల్. ఎవరికి వాళ్లు- స్పెషల్ క్లాసుందని తప్పించుకునేవారు. నాకు మాత్రం తప్పేది కాదు. వాదులాటలూ, వాగ్వాదాల తలనొప్పి వద్దులెమ్మని కూరలకు స్వస్తిపలికేశా. అన్నం వండుకుని.. మెస్ నుంచి సాంబార్ తెచ్చుకునేవాళ్లం. బ్యాచిలర్ కుర్రాళ్లు.. అన్న సానుభూతితో కాబోలు.. బోల్డంత సాంబార్ ఇచ్చేవాడు. మెస్సాయనా జిందాబాద్!