-
-
By Chowdary
Updated :
21 November 2025 02:26 PM
కాజీపేట, న్యూస్‌టుడే: కాజీపేట నుంచి బల్లార్ష వైపు మధ్యాహ్నం రైళ్లు లేవని ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే 17036 నంబరు గల కాజీపేట- బల్లార్ష ఎక్స్‌ప్రెస్‌ను మాత్రం పగటి పూట 14 గంటలు పాత వాషింగ్ ఏరియాలో ఖాళీగా ఉంచుతున్నారు.
వరంగల్ నుంచి బల్లార్ష మార్గంలోని జమ్మికుంట, పెద్దపల్లి, రాఘవపురం, రామగుండం, మంచిర్యాల తదితర ప్రాంతాలకు వెళ్లడానికి రైలు మార్గం సౌకర్యంగా ఉంటుంది. కాజీపేట మీదుగా ఉదయం రామగిరి, కాగజ్‌నగర్ ఇంటర్సిటీ, కాగజ్‌నగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లున్నాయి. కాజీపేటలో రామగిరి (17003) ఉదయం 5:25 గంటలకు, 17011 సిర్పూర్ కాగజ్‌నగర్ ఇంటర్సిటీ 7:10, 12723 తెలంగాణ సూపర్‌ఫాస్ట్ 8:00, 12757 నంబరు గల కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ 10:10 గంటలకు ఉంటాయి. వీటి తర్వాత బల్లార్ష మార్గంలో కాజీపేట నుంచి సాయంత్రం 5:20 గంటలకు వచ్చే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ వరకు ఒక్క సాధారణ రైలు కూడా లేదు. అంటే ఉదయం 10:10 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ మార్గంలో వెళ్లాలనుకునేవారు రోడ్డు మార్గాన్నే ఎంచుకోవాలి. ఈ సమయంలో ఇంటర్సిటీ లేదా ప్యాసింజర్ రైలు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.