-
-
By Chowdary
Updated :
21 November 2025 12:10 PM
జాతీయ రహదారి-44పై చేపట్టిన రైల్వే వంతెనల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఒకే మార్గంలో వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 49 ప్రమాదాల్లో 15 మంది మృతిచెందగా.. 35 మంది క్షతగాత్రులయ్యారు.
ఈ మూడు చోట్లే: హైదరాబాద్ మార్గంలో మహబూబ్నగర్ పరిధిలోని దివిటిపల్లి వద్ద వంతెన తక్కువ ఎత్తులో ఉంది. రైల్వేలైన్ డబ్లింగ్ పనుల నేపథ్యంలో కొత్త వంతెన మంజూరు కాగా 2022 ఫిబ్రవరిలో పనులు ప్రారంభించారు. ఇప్పటికీ పూర్తికాలేదు. భూత్పూర్ మండలం తాటిపర్తి శివారులో, జడ్చర్ల పరిధి మల్లెబోయిన్పల్లి వద్ద సైతం వంతెనలు నిర్మిస్తున్నారు. ఈ మూడు చోట్ల కర్నూలు మార్గంలోనే 2 కి.మీ మేర హైవేలో డైవర్షన్లు ఏర్పాటు చేశారు. రాయలసీమ, బెంగళూరుకు ఇదే ప్రధాన మార్గం కావడంతో నిత్యం వేలల్లో వాహనాలు తిరుగుతుంటాయి. రాత్రిళ్లు డైవర్షన్ల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి.
రక్షణ గోడలు ఎప్పుడో?: దివిటిపల్లి - తాటిపర్తి వాసుల సౌకర్యార్థం అండర్పాస్, కేసీఆర్ కాలనీకి వంతెన కోసం ప్రతిపాదనలు చేశారు. రైల్వే అనుమతుల్లో జాప్యం కారణంగా చాలా రోజులకు అండర్పాస్ పూర్తయింది. కేసీఆర్ కాలనీ వెళ్లేందుకు వంతెన, రక్షణ గోడ పనులు జరుగుతున్నాయి. ఐటీ పార్కు మలుపు నుంచి మల్లెబోయిన్పల్లి వసతిగృహం వరకు హైదరాబాద్ మార్గంలో దారి మళ్లించారు.