-
-
By Nag
Updated :
21 November 2025 12:09 PM
ఇళ్లలో చెత్త స్వచ్ఛ ఆటోలకు వేయకుండా వీధుల్లో విసిరేస్తున్న ఇళ్ల యజమానుల్లో మార్పు తెచ్చేందుకు నగరపాలక సంస్థ సిద్ధమవుతోంది. చాలా మంది యజమానులు నెలకు రూ.70 ఇవ్వాల్సి వస్తోందని రాత్రి 10 గంటల తర్వాత, లేదంటే తెల్లవారు జామున వీధి చివరన కూడళ్లు, సమీప మురుగు కాల్వల్లో పారేస్తున్నారు. ఇది స్వచ్ఛ పాలమూరు ఆశయానికి తూట్లు పొడుస్తోంది. తడి, పొడి చెత్త వేర్వేరు బుట్టల్లో పోగు చేయాలని, రోజు మార్చి రోజు కాలనీకి వచ్చే వాహనంలో వేయాలని పారిశుద్ధ్య సిబ్బంది, అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, స్వయం సహాయక మహిళలు విస్తృత అవగాహన కల్పిస్తున్నా.. మార్పు రావడం లేదు. ఇలాంటి వారిని గుర్తించి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
స్వచ్ఛ ఆటోలు 72: నగరంలో చెత్త సేకరణకు 72 స్వచ్ఛ ఆటోలు, 5 ట్రాక్టర్లు ఉన్నాయి. ఎంత చెప్పినా మార్పు రాని ఇంటి యజమానులను గుర్తించేందుకు అధికారులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. వీరు నిత్యం వీధుల్లో తిరుగుతూ ఆటోల్లో చెత్త ఎవరు వేయడం లేదో గుర్తిస్తున్నారు. ముందుగా ఇంటి యజమాని, కుటుంబ సభ్యులను.. వాహనంలో ఎందుకు వేయడం లేదో ప్రశ్నిస్తారు. మరోమారు ఇలాగే వ్యవహరిస్తే ఇంటి ముఖద్వారం వద్ద ఎర్ర రంగు ముద్ర వేస్తామని, అయినా వినకుంటే రూ.వెయ్యి జరిమానా వేస్తామని హెచ్చరిస్తారు. ఈ విధానం జీహెచ్ఎంసీ పరిధిలో పక్కాగా అమలు చేస్తుండటంతో సత్ఫలితాలు వస్తున్నాయి.