-
-
By Chowdary
Updated :
21 November 2025 12:08 PM
దేవుడి మాన్యం భూములు కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్పోర్స్ను ఏర్పాటు చేయటానికి కసరత్తు చేస్తోంది. అవసరమైతే ఎండోమెంట్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోనున్నామని దేవాదాయ మంత్రి కొండా సురేఖ ప్రకటించిన నేపథ్యంలో భూముల రక్షణ అంశం మరోమారు తెరపైకి వచ్చింది.
పలు చోట్ల దేవాలయ భూములు ధూపదీప నైవేద్యాల పేరుతో అనుభవిస్తున్న వారు ఓఆర్సీలు పొంది విక్రయించేశారు. మరి కొందరు రెవెన్యూ లొసుగులను ఆసరా చేసుకొని ఓఆర్సీలు పొందేందుకు యత్నిస్తున్నారు. ఇనాం భూములు క్రయవిక్రయాలకు వస్తే నిలిపేయాల్సిందిగా దేవాదాయ శాఖ అధికారులు ఫిర్యాదు రాసి చేతులు దులుపుకుంటున్నారు.
గెజిట్ ఏదీ: ఆక్రమణలకు అవకాశం లేకుండా దేవాలయ భూములు సర్వే చేసి గెజిట్ వేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించినా అమల్లోకి రాలేదు. గతేడాది పుల్లూరు, వేముల శివారులో ఉన్న భూములకు ఆక్రమణదారులు ఎసరు పెట్టారు. జిల్లా స్థాయి అధికారులే వీటి అన్యాక్రాంతానికి పావులు కదిపారు.
గెజిట్ ద్వారా మాత్రమే దేవుడి భూములకు రక్షణ కల్పించటానికి పూర్తి అవకాశం ఉంటుంది. సర్వేచేసి గెజిట్ వేస్తే దేవుడి పేరుతోనే పట్టాదారు పాసుపుస్తకాలు జారీ అయ్యే అవకాశం ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో రెవెన్యూ రికార్డుల ప్రకారం 15,449.63 ఎకరాల దేవుడి భూములున్నాయి. వీటిలో 1,776 ఎకరాల వరకు ఇప్పటికే ఆక్రమణదారుల చేతుల్లో ఉన్నట్లు గతంలో గుర్తించారు.
రెవెన్యూ కార్యాలయాల్లో లంచాలకు అలవాటు పడిన కొందరు అధికారులు ఫిర్యాదులను పక్కన బెట్టి ఆక్రమణదారులకు సహకరిస్తున్నారు. గద్వాలలో గతంలో పని చేసిన ఓ ఆర్డీవో పెద్ద ఎత్తున ఓ ఆర్సీల జారీకి దస్త్రాలను సిద్ధం చేయటం మీడియాలో కథనాలు రావటంతో అడ్డుకట్ట పడింది.