-
-
By Chowdary
Updated :
21 November 2025 12:06 PM
నెల రోజులుగా కిలో వంకాయ రూ.80కి దిగిరావడం లేదు. క్యారెట్, పచ్చిమిర్చి, బీర, కాకర కొండెక్కి కూర్చున్నాయి. రైతు బజార్‌కు వినియోగదారులు రూ.500 తీసుకెళ్తే చిన్న సంచి నిండటం లేదు. క్యాలీఫ్లవర్, దొండ, చిక్కుడు, గోరు చిక్కుడు, బీట్రూట్ రూ.60కి తగ్గడం లేదు. ములక్కాడలు కిలో రూ.120 ఉంటే, రూ.10 ఉండే టమాట రూ.40కి చేరింది.
దాసరి నర్సింహులుదిహన్వాడ మండల కేంద్రం. తనకున్న రెండెకరాల్లో ప్రతి సీజన్లో కాపు వచ్చేలా కూరగాయలు వేస్తారు. ప్రస్తుతం బీర, పాలకూర, బెండ సాగు చేశారు. చలి తీవ్రత కారణంగా పాలకూర ఎదగడం లేదు. బెండకు తెగుళ్లు సోకడంతో పెట్టుబడి రాని పరిస్థితి. ఇతర కూరగాయల సాగు చేద్దామని భావిస్తే చలి కారణంగా వాయిదా వేసుకున్నారు.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణం సెప్టెంబరు, అక్టోబరులో కురిసిన వర్షాలే. రైతులు సాగు చేసిన తోటలు తెగుళ్ల బారిన పడ్డాయి. వర్షాలు తగ్గాయని అన్నదాతలు ఊపిరి పీల్చుకుంటే.. ఇప్పుడు చలి తీవ్రత పెరిగి వారిని చతికిల పడేసింది. కొన్నిచోట్ల విత్తనాలు నేలలో వేస్తే మొలకెత్తడం లేదు. మరికొన్ని చోట్ల మొలకెత్తినా పెరగడం లేదు. వ్యవసాయాధికారుల సూచనలతో మందులు పిచికారీ చేసి పండిద్దామని రైతులు ప్రయత్నిస్తున్నా దిగుబడులు పడిపోతున్నాయి. కొత్తగా నారు మడులు సిద్ధం చేసుకోలేకపోతున్నారు. దీంతో బీర, బెండ, టమాట తదితర కూరగాయల దిగుబడి తగ్గిపోతోంది. ఉమ్మడి జిల్లాలో సీజన్లో సగటున రోజుకు 4,800 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. చలితీవ్రతకు రావడం లేదు. ఇతర జిల్లాల నుంచి 12,500 క్వింటాళ్లు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇది ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతోంది.