-
-
By Chowdary
Updated :
21 November 2025 12:04 PM
అనుమానం మనిషిని మృగంలా మారుస్తుందనేందుకు ఖమ్మం నగరంలో గురువారం ఉదయం చోటుచేసుకున్న సంఘటనే నిదర్శనం. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి కత్తితో గొంతు కోసి ఆమెను దారుణంగా హతమార్చాడు. అడ్డువచ్చిన కుమార్తె గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఖమ్మం రెండో పట్టణ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ కథనం ప్రకారం... ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడకు చెందిన వ్యవసాయదారుడు గోగుల భాస్కర్‌తో ఏపీ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన సాయివాణి(33)కి పదహారేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె హర్షవర్ధిని, కుమారుడు వేమేంద్రలక్ష్మీనరసింహ ఉన్నారు.
భార్యపై అనుమానం పెంచుకున్న భాస్కర్ గత కొన్నేళ్లుగా వేధిస్తున్నాడు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినా, జగ్గయ్యపేట పోలీసు స్టేషన్లో రెండుసార్లు కౌన్సెలింగ్ చేసినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. గతేడాదిగా దంపతులు విడిగా ఉంటున్నారు. కొద్ది నెలలు తల్లిదండ్రుల వద్ద ఉన్న సాయివాణి, పిల్లలతో కలిసి ఆరు నెలల క్రితం ఖమ్మం వచ్చి గట్టయ్య సెంటర్లో ఓ అద్దె ఇంట్లో నివసిస్తోంది. స్థానికంగా ఫంక్షన్ హాలులో పనిచేస్తూ పిల్లలను చదివిస్తోంది. భార్యపై అక్కసు పెంచుకున్న భాస్కర్ తెల్లవారుజామునే ఆమె ఉండే ఇంటివద్దకు వచ్చి మాటువేశాడు. ఉదయం తలుపు తీసి బయటకు వచ్చిన సాయివాణిపై కత్తితో దాడి చేశాడు. తప్పించుకుని ఇంట్లోకి పరుగెత్తే ప్రయత్నం చేసినా వెంటపడ్డాడు. అనంతరం కత్తితో గొంతుపై బలమైన గాయం చేయడంతో తీవ్రంగా గాయపడ్డ సాయివాణి అక్కడికక్కడే మృతి చెందింది.