-
-
By Chowdary
Updated :
21 November 2025 11:59 AM
అంతరించిపోతున్న కళారంగానికి జీవం పోస్తూ.. ప్రజాచైతన్య నాటిక ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరిస్తూ.. ఆనంద వెన్నెలను పంచుతున్న అభ్యుదయ సాంస్కృతిక కదంబం ‘నెల నెలా.. వెన్నెల’ కార్యక్రమం 100వ ప్రదర్శనకు ముస్తాబైంది. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం 6గంటలకు జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హాజరవుతారు.
2015 జూన్ 15న తొలి ప్రదర్శన
అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ, ఖమ్మం కళాపరిషత్, ప్రజా నాట్యమండలి సంయుక్త నిర్వహణలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సౌజన్యంతో ‘నెల నెలా.. వెన్నెల’ తొలి కార్యక్రమం భక్తరామదాసు కళాక్షేత్రంలో 2015 జూన్ 15న జరిగింది. తొలినాళ్లలో ప్రతి కార్యక్రమంలో రెండు నాటికలు ప్రదర్శించారు. ఇలా పదకొండు నెలల పాటు కొనసాగించారు. 12వ ప్రదర్శన నుంచి ఒకే నాటికను ప్రదర్శిస్తున్నారు.కళారంగంలో విశేష సేవలందించిన కళాకారులకు పురస్కారాలు, నగదు బహుమతులు అందిస్తున్నారు. ‘నెల నెలా.. వెన్నెల’ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టులో తెలుగు రాష్ట్రాల స్థాయి నాటక పోటీలను రెండేళ్లుగా నిర్వహిస్తున్నారు. సినీరంగంలో కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆరు నెలలుగా రెండు లఘుచిత్రాలను ప్రదర్శిస్తున్నారు.