-
-
By Chowdary
Updated :
21 November 2025 11:54 AM
గొలుసు కట్టు వ్యాపారం పేరుతో జిల్లాలో వందలాది మందిని మోసం చేశారు. ఈ కేసులో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు నిజామాబాద్ సీపీ సాయిచైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన తోకల బక్కన్న అక్టోబరు 13న కోటగల్లి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ బీఎంబీ మల్టీ లెవల్ కంపెనీ కార్యాలయంలోనున్న చంద్రశేఖర ప్రసాద్ ఆయన్ను పిలిచి మాట్లాడారు. ఇంగ్లాండ్కు చెందిన తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని, ప్రకటనలకు రేటింగ్ ఇస్తే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చని నమ్మించాడు. బక్కన్న కంపెనీ యాప్లో చేరి రూ.84 వేలు చెల్లించాడు. తన బంధువులు, స్నేహితులతోనూ పెట్టుబడులు పెట్టించాడు. చివరకు మోసపోయామని తెలిసి బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు చంద్రశేఖరప్రసాద్ను అదుపులోకి తీసుకుని విచారించారు. మోసానికి ప్రధాన సూత్రధారిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. చైనా సంబంధిత కంపెనీకి డబ్బులు తరలినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. జిల్లావ్యాప్తంగా సుమారు 750 మంది రూ.కోటిన్నర వరకు పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించామని, బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సీపీ తెలిపారు.