-
-
By Chowdary
Updated :
21 November 2025 10:24 AM
సూర్యాపేట నేరవిభాగం: సూర్యాపేట గ్రామీణ ఠాణా పరిధిలోని పిల్లలమర్రి శివారులో ఈ నెల 15న ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం కరక్కాయలపేటకు చెందిన నాగవరపు సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు(50) హత్యకు గురయ్యాడు. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. గురువారం ఆయా వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఆయన కథనం మేరకు... పిల్లలమర్రి శివారులో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు సూర్యాపేట గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా పోలీసుల వద్ద ఉన్న ఫింగర్ ప్రింట్ డేటాబేస్ ఆధారంగా మృతుడి వేలిముద్రలను సరిపోల్చడంతో సత్యనారాయణ వివరాలు బహిర్గతమయ్యాయి. గతంలో ఇతను భార్య ఝాన్సీరాణితో గొడవపడి హైదరాబాద్ బోయినపల్లిలోని తన బావమరిది గెల్లా కిరణ్ ఇంట్లో కత్తితో దాడిచేయడంతో ఆమె మృతిచెందింది. బావమరిది భార్య షీలా గాయాలతో బయటపడింది. ఈ కేసులో విచారణ ఖైదీగా జైలుకు వెళ్లిన సత్యనారాయణ ఈ నెల 6న జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాడు. మరుసటి రోజు స్వగ్రామం కరక్కాయపేటకు వెళ్లాడు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన అందరినీ చంపుతానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కోర్టుకు హాజరైన ఇతన్ని బంధువులు కారులో అపహరించి హత్య చేశారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై నుంచి కారులోవచ్చి పిల్లలమర్రి శివారులోని ఖమ్మం జాతీయ రహదారి పక్కన చిన్న కాలువలో పడేశారు. దర్యాప్తు అనంతరం ఈ కేసులో నిందితులు గెల్లా కిరణ్, షీలా, చీకురుమిల్లి అమ్మాజీ, మాధవరావు, శిశికుమార్, మౌనిక, నేతల సర్వేశ్వరరావు, గిడ్డి రమేశ్, విశ్వనాథంలను హైదరాబాద్ జీడిమెట్లలో అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో చురుగ్గా పనిచేసిన క్లూస్, డాగ్ స్క్వాడ్ సిబ్బందిని, గ్రామీణ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్సై బాలునాయక్, పెన్‌పహాడ్ ఎస్సై గోపీకృష్ణ, పర్యవేక్షించిన డీఎస్పీ ప్రసన్నకుమార్‌ను ఎస్పీ అభినందించి రివార్డు అందజేశారు.