-
-
By Chowdary
Updated :
21 November 2025 09:50 AM
ఏళ్లుగా సొంతిళ్లు లేక.. అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఉట్నూరు, ఇంద్రవెల్లి, సిరికొండ, జన్నారం, కడెం, దస్తూరాబాద్, పెంబి, ఖానాపూర్ మండలాలు కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం(టైగర్ జోన్)పరిధిలోకి వస్తాయి. దీంతో ఈ ప్రాంతంలో ఇసుక క్వారీలు లేక.. నిర్మాణానికి కావాల్సిన ఇసుక లభించక ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగక లబ్ధిదారులకు కష్టాలు తప్పడం లేదు. ఈ సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇసుక వెతలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో సర్కారు వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూరులో ఇసుక బజార్‌ను ఏర్పాటు చేసింది.
తెలంగాణ భూగర్భ ఖనిజాలు, గనుల అభివృద్ధి కార్పొరేషన్(టీజీఎండీసీ)ఆధ్వర్యంలో ఈ నెల 17న ఉట్నూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఇసుక బజార్‌ను ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు, కాళేశ్వరం ఇసుక క్వారీల నుంచి నాణ్యమైన గోదారి ఇసుకను టీజీఎండీసీ అధికారులు భారీ వాహనాలలో ఉట్నూరుకు తరలిస్తున్నారు. ఇక్కడ ఇసుకను తూకం చేయడానికి ఎలక్ట్రికల్ కాంట(వెయింగ్ మిషన్)ను అమర్చారు.