-
-
By Chowdary
Updated :
19 November 2025 03:02 PM
ఎక్కడ చూసినా రాయితీలు.. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలంటూ ప్రచారం.. రకరకాల ఆఫర్లు.. క్రెడిట్ కార్డులతో కొంటే వాయిదాల్లో చెల్లింపు, నగదు వెనక్కిలాంటి ఆకర్షణలు.. పండగల వేళ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో క్రెడిట్ కార్డులను చాలా జాగ్రత్తగా వాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే అనవసరంగా అప్పుల ఊబిలో చిక్కుకుంటారు. బిల్లులు సరైన సమయానికి చెల్లించకపోతే ఇబ్బందులు తప్పవు. ఇలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా ఏం చేయాలో తెలుసుకుందాం.
నగదు వద్దు: పండగల వేళ నగదు అవసరాల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్ కార్డును వినియోగించొద్దు. కార్డులతో నగదు తీసుకుంటే, దానికి అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. పైగా, దీనికి అదనపు సమయమూ ఉండదు. మీరు డబ్బు తీసుకున్న మరుక్షణం నుంచే వడ్డీ ప్రారంభం అవుతుంది. వడ్డీతోపాటు ఇతర రుసుములనూ భరించాల్సి వస్తుంది. కాబట్టి, వీలైనంత వరకూ డబ్బు కోసం కార్డును వాడొద్దు.
కనీస మొత్తం: క్రెడిట్ కార్డు బిల్లులో కనీస మొత్తం చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ గమనించాల్సింది అది వెసులుబాటు మాత్రమే. కానీ, మొత్తం బాకీని చెల్లించినప్పుడు ఉండే ప్రయోజనాలు ఇక్కడ లభించవు. మీరు కనీస మొత్తం చెల్లించగా, మిగిలిన బాకీపై వడ్డీ భారం తప్పదు. కాబట్టి, మొత్తం బిల్లు చెల్లించలేని పరిస్థితుల్లోనే కనీస బాకీ చెల్లింపును వాడుకోవాలి. వీలునుబట్టి, కాస్త అధికంగా చెల్లించడం మంచిది. అప్పుడు వడ్డీ భారం కాస్త తగ్గుతుంది.
ఆలస్యం చేస్తే: పండగల వేళ కొనుగోళ్లు చేసినప్పుడు బిల్లులను సకాలంలో తీర్చే ఏర్పాటూ చేసుకోవాలి. వ్యవధి తీరిన తర్వాత చెల్లిస్తే, ఆలస్యపు రుసుము వర్తిస్తుంది. అంతేకాదు, మీ క్రెడిట్ నివేదికలోనూ ఇది నమోదవుతుంది. దీనివల్ల భవిష్యత్తులో ఏదైనా రుణం తీసుకోవాలని అనుకున్నప్పుడు చిక్కులు ఎదురవుతాయి. అందుకే, వ్యవధికి ముందుగానే బిల్లు చెల్లించడం ఉత్తమం.
అందుబాటులో ఉంటేనే: క్రెడిట్ కార్డుతో కొనే వస్తువు ధర మీకు అందుబాటులో ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ దాని ఖరీదు మీ బడ్జెట్‌కు మించి ఉన్నప్పుడు, బిల్లు చెల్లించడంలో ఇబ్బందులు వస్తాయి. ముందుగానే ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
సరైన కార్డు: కొనుగోలు చేసేటప్పుడు ఏ కార్డును ఎంపిక చేసుకోవాలన్నదీ ముఖ్యమే. ముందుగా మీ దగ్గరున్న కార్డులు పరిశీలించండి.ఏ బ్యాంకు కార్డుతో ఎక్కువ రాయితీలు, నగదు వెనక్కి, రివార్డులు వస్తున్నాయో చూసుకోండి. ఆ కార్డుతోనే కొనుగోలు చేయండి. కార్డును ఎంచుకునేటప్పుడు తక్కువ వడ్డీ రేటు, వార్షిక రుసుములు లేని వాటినే తీసుకోవాలి. కొత్తగా కార్డు తీసుకునేటప్పుడు ఈ వివరాలన్నీ తెలుసుకోవాలి.
వివరాలు చూడండి: కొనుగోలు చేసిన ప్రతి వస్తువు బిల్లు మీ దగ్గర దాచుకోండి. కార్డు స్టేట్మెంట్తో పోల్చి చూసుకోండి. ఏమైనా తేడాలుంటే, బ్యాంకు/కార్డు సంస్థ దృష్టికి తీసుకెళ్లాలి.
ఈఎంఐగా మారిస్తే: పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినప్పుడు దాన్ని నెలవారీ వాయిదాల్లోకి (ఈఎంఐ) మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. మీకు ఒకేసారి బిల్లు చెల్లించడం సాధ్యం కాకపోతే, ఈఎంఐకి మార్చుకోవచ్చు. దీనికి ఎంత వడ్డీ ఉంటుందన్నది చూసుకోవాలి. సాధారణంగా బ్యాంకులు 19 శాతం వరకూ వార్షిక వడ్డీని వసూలు చేస్తుంటాయి. మీకు వీలున్నప్పుడు ఒకటి రెండు ఈఎంఐలు చెల్లిస్తూ వెళ్తే, తొందరగా రుణం తీరేందుకు వీలుంటుంది.