-
-
By Chowdary
Updated :
19 November 2025 02:57 PM
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మదుపరుల ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. కొంతమంది ఒకటి రెండు ఫండ్లకే పరిమితం అవుతారు. కొందరు వీలైనన్ని ఎక్కువ ఫండ్లలో మదుపు చేస్తే, నష్టభయం పరిమితం అవుతుందని భావిస్తారు. ఎక్కువ ఫండ్లలో మదుపు చేస్తే.. ఒకే తరహా షేర్లను ఎంచుకున్నట్లే, దీనివల్ల రాబడి తగ్గే ప్రమాదమూ ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మీ పోర్ట్‌ఫోలియోలో ఎన్ని మ్యూచువల్ ఫండ్ పథకాలు ఉంటే బాగుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రతి ఫండ్ పథకమూ దాదాపు 40-70 షేర్లతో పోర్ట్‌ఫోలియో నిర్మిస్తుంది. అంటే, మీరు పథకాలను ఎంచుకున్న ప్రతిసారీ ఒకే తరహా షేర్లలో మదుపు చేస్తున్నట్లు లెక్క. కాబట్టి, మరిన్ని ఫండ్లను జోడించడం అంటే, రిస్కును తగ్గించుకోవడం కన్నా, ఒకే షేరులో తిరిగి మదుపు చేస్తున్నట్లు అవుతుంది.
మీ పోర్ట్‌ఫోలియోలో మ్యూచువల్ ఫండ్ పథకాల సంఖ్య ఎంత ఉండాలి? పెట్టుబడుల్లో తగిన వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ.. గరిష్ఠంగా 8-9 పథకాలు ఉంటే చాలు. ఇంతకుమించితే, వైవిధ్యం తగ్గిపోతుంది.
మీ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ ఫండ్లు ఉంటే వైవిధ్యం మరీ పెరిగిపోతుంది. దీనివల్ల పెద్దగా లాభాలు రాకపోవచ్చు.
రూ.25లక్షల లోపు పోర్ట్‌ఫోలియో ఉన్నప్పుడు 4-5 ఫండ్లకే పరిమితం కావాలి. అంతకు మించితే.. రూ.5 లక్షలకు ఒక ఫండ్‌ను జత చేసుకుంటూ వెళ్లాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
రూ. కోటి పోర్ట్‌ఫోలియో ఉంటే గరిష్ఠంగా 10 ఫండ్లు సరిపోతాయని అనుకోవచ్చు.
ఒకే తరహా షేర్లలో, విభాగంలో మదుపు చేసే ఫండ్లను ఎంచుకున్నప్పుడు వీటి మధ్య కనీసం 40 శాతానికి మించి వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి.
ఫండ్ల ఎంపికలో ఆర్థిక లక్ష్యాలు, వ్యవధి కీలకం.
0-3 ఏళ్లలోపు పెట్టుబడి అవసరాలుంటే, లిక్విడ్, డెట్ ఫండ్లను పరిశీలించాలి.
3-5 ఏళ్ల వ్యవధికి హైబ్రిడ్ లేదా బ్యాలెన్స్డ్ ఫండ్లను ఎంచుకోవాలి.
దీర్ఘకాలిక అవసరాల కోసం లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్ ఫథకాలను చూడాలి.