-
-
By Chowdary
Updated :
20 November 2025 12:20 PM
ఇంటర్నెట్ డెస్క్: ప్రభాస్ నట ప్రయాణానికి 23 ఏళ్లు (23 Years for Prabhas Career). ఆయన నటించిన తొలి సినిమా ‘ఈశ్వర్’ (Eeswar Movie) 2002లో నవంబరు 11న విడుదలైంది. నటనలో శిక్షణ పూర్తికాకుండానే ప్రభాస్ ఈ చిత్రం చేయాల్సి వచ్చింది. అసలు ఈ మూవీ ఎలా మొదలైందన్నది దర్శకుడు జయంత్ సి.పరాన్జీ (Jayanth C Paranjee) గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ విశేషాలు గుర్తుచేసుందాం (23 Years for Eeswar)..
‘‘నేను మహేశ్‌బాబుతో ‘టక్కరి దొంగ’ సినిమా చేస్తున్న సమయంలో.. తనకో చిత్రం చేస్తానని నిర్మాత అశోక్ కుమార్‌కు మాటిచ్చా. నాకు ప్రేమ కథలంటే ఇష్టం. ఆయా స్టోరీల్లో యాక్షన్ కూడా ఉంటే బాగుంటుందని ఎప్పుడూ అనుకుంటా. ఆ క్రమంలో వచ్చిందే ‘ఈశ్వర్’ ఆలోచన. దాన్ని తక్కువ బడ్జెట్లోనే తెరకెక్కించాలని నేనూ, అశోక్ నిర్ణయించుకున్నాం. ఈ కథకు లవర్‌బాయ్ ఇమేజ్ ఉన్న నటుడు సరిపోడు అని భావించి.. మాస్ లుక్ ఉండే కొత్త హీరో కోసం ప్రయత్నాలు మొదలుపెట్టా. అదే సమయంలో.. ‘కృష్ణంరాజు గారి సోదరుడి అబ్బాయి ప్రభాస్ సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు’ అని ఎవరో చెబితే తెలిసింది’’
‘‘ఫొటోలు చూడగానే హీరో మెటీరియల్ అనుకొని, ఓ హోటల్లో ఆయన్ను కలిశా. స్టార్ అవుతాడని అప్పుడే అర్థమైంది. వెంటనే ‘మనకు కావాల్సిన హీరో’ అని ఫిక్స్ అయిపోయా. ‘నా ట్రైనింగ్ ఇంకా పూర్తి కాలేదండి. కొంత సమయం కావాలి’ అని ప్రభాస్ కోరాడు. నీకు శిక్షణ అవసరం లేదు.. నువ్వు నటించగలవు అంటూ నేను సినిమా బేసిక్ లైన్ చెప్పగానే ప్రభాస్ అంగీకరించాడు. పూర్తి కథ వినకుండానే నన్ను నమ్మాడు’’ అని జయంత్ వివరించారు. ఈ సినిమా కోసం ప్రభాస్‌ను ఎంపిక చేయక ముందు సినీ నేపథ్యమున్న ఓ యువకుడి ఫొటోలనూ పరిశీలించారట. ఇప్పుడతను పెద్ద స్టార్ అయ్యాడని చెప్పిన జయంత్.. ఆ హీరో వివరాలు మాత్రం బయటపెట్టలేదు.