-
-
By Chowdary
Updated :
20 November 2025 12:00 PM
అవకాశాల కోసం ఆరాటపడే తత్వం నాది కాదం’’టోంది నటి అను ఇమ్మాన్యుయేల్. కెరీర్ ఆరంభంలో చేసినట్లుగా ఇకపై రొటీన్ కమర్షియల్ చిత్రాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఆమె ఇటీవలే రష్మికతో కలిసి ‘ది గర్ల్‌ఫ్రెండ్’లో నటించింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది అను ఇమ్మాన్యుయేల్.
‘‘హాలీవుడ్ సినిమాల్లో హీరో, హీరోయిన్, విలన్.. ఇలా విభజన ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరూ కథను ముందుకు నడిపే విధంగా పాత్రల్ని సిద్ధం చేస్తారు. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం కోసం దర్శకుడు రాహుల్ రవీంద్రన్ అలాంటి ప్రయత్నమే చేశారు. అన్ని పాత్రలకు న్యాయం చేసేలా సినిమాని రూపొందించారు. ఈ చిత్రాన్ని నేను థియేటర్స్‌లో చూశా. కొన్ని సీన్స్‌కు అబ్బాయిలు కూడా చప్పట్లు కొట్టడం ఆనందంగా అనిపించింది’’.
‘‘అమ్మాయిల గురించి ఒక మంచి విషయం చెప్పే చిత్రమిది. అందుకే దీంట్లో నాది చిన్న పాత్రైనా తప్పకుండా నటించాలని నిర్ణయించుకున్నా. ఇలాంటి సినిమాలు మనసుకి సంతృప్తినిస్తాయి. ఏదైనా కొత్తగా నేర్చుకోవచ్చనే ఆలోచనతో దీన్ని చేశాను. ఇప్పుడీ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటం ఆనందంగా ఉంది. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో ఓవర్ యాక్షన్ చేయిస్తారు. దుర్గ పాత్ర పోషించేటప్పుడు చాలా సహజంగా టోన్ డౌన్ చేసి నటించా. రాహుల్ ఇచ్చిన సలహాతోనే ఇది చేయగలిగా. అందుకే ఈ పాత్ర తెరపై మరింత సహజంగా కనిపించింది. ఈ చిత్రంలో చూపించినట్లు మహిళలకు సమాజం ఎన్నో కట్టుబాట్లు పెడుతుంటుంది. ఎలా మాట్లాడాలి.. ఎలాంటి దుస్తులు ధరించాలి.. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి.. పిల్లల్ని ఎప్పుడు కనాలి.. ఇలా ఎన్నో షరతులుంటాయి. మగవాళ్లకు ఉద్యోగం, సంపాదన తప్ప మరే షరతులు ఉండవు’’.
‘‘నా సినీ ప్రయాణం పట్ల అసంతృప్తిగానే ఉన్నా. కానీ, నటిగా ఓ సంతృప్తి ఉంది. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, నాని, నాగచైతన్య, కార్తి, శివ కార్తికేయన్ లాంటి పెద్ద స్టార్స్‌తో కలిసి నటించాను. అయితే నా కెరీర్లో కొన్ని సినిమాలు చేసి ఉండకూడదని ఇప్పుడు అనిపిస్తోంది. కొన్ని కమర్షియల్ చిత్రాల్లో నటించడం వల్ల నటిగా నాకు ఎలాంటి సంతృప్తి లభించదు. నాలుగు డ్యాన్స్ స్టెప్పులు వేసి.. కొన్ని డైలాగ్స్ చెప్పిస్తారంతే. అందుకే ఇకపై అలాంటి సినిమాలు చేయకూడదనుకున్నా. ప్రస్తుతం నేను కొన్ని కథలు వింటున్నా. ఓ సినిమా ఓకే అయింది. త్వరలో నిర్మాణ సంస్థే ఆ వివరాల్ని వెల్లడిస్తుంది’’.