-
-
By Chowdary
Updated :
20 November 2025 11:51 AM
Kaantha Movie Review || చిత్రం: కాంత; నటీనటులు: దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి తదితరులు; సంగీతం: జాను చందర్; సినిమాటోగ్రఫీ: డానీ సాంచెజ్ లోపేజ్; ఎడిటింగ్: లెవెలిన్ ఆంథోని గొంజల్వేజ్; నిర్మాత: రానా, దుల్కర్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్; రచన, దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్; విడుదల: 14-11-2025
పీరియాడిక్ సినిమాల జోరు కొనసాగుతున్న కాలమిది. దుల్కర్ సల్మాన్ ఈ తరహా కథలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ‘కాంత’తో మరోసారి ఆ ప్రయత్నం చేశారు. ఈ కథకు సంబంధించి తమిళనాడులో వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఒకవైపు వివాదం నడుస్తుండగా, మరోవైపు బలమైన ప్రచారంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
కథేంటంటే..
Kaantha Movie Story || అయ్య (సముద్రఖని) ఓ ప్రముఖ దర్శకుడు. తన తల్లి జీవితం ఆధారంగా ‘శాంత’ చిత్రం తీయాలనుకుంటాడు. తన శిష్యుడైన టి.కె.మహదేవన్ (దుల్కర్ సల్మాన్) అందులో హీరో. కానీ, సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ప్రారంభమవుతుంది. ఈసారి కూడా హీరో మహదేవనే. అయితే ఈసారి తను చెప్పిన క్లైమాక్స్‌తోనే సినిమాని తీయాలనే ఒక షరతుతో సినిమా చేయడానికి ఒప్పుకొంటాడు మహదేవన్. సినిమా పేరు కూడా ‘శాంత’ బదులుగా ‘కాంత’ అని సూచిస్తాడు. తన తల్లి కథని తెరపై చూసుకోవాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో హీరో షరతులు పెడుతున్నా ఒప్పుకొని సినిమాని ప్రారంభిస్తాడు అయ్య. సినిమా చేస్తున్నారన్నమాటే కానీ సెట్లో హీరో, దర్శకుడికి ఒకరంటే ఒకరికి పడదు. ఇద్దరి మధ్య మాటల్లేకుండానే చిత్రీకరణ సాగిపోతూ ఉంటుంది. ఆ ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నం చేస్తుంటుంది కథానాయిక కుమారి (భాగ్య శ్రీ బోర్సే). ఇక సినిమా పూర్తవుతుందన్న దశలోనే మరో పెద్ద సమస్య వస్తుంది. సినిమా బృందంలో కీలకమైన ఒకరు హత్యకు గురవుతారు. ఆ హత్య చేసింది నువ్వంటే నువ్వంటూ హీరో, దర్శకుడు ఒకరిపై ఒకరు నిందలేసుకుంటారు. ఆ నేరం వెనక ఎవరున్నారో కనిపెట్టేందుకు ఇన్స్పెక్టర్ దేవరాజ్ (రానా దగ్గుబాటి) రంగంలోకి దిగుతాడు. ఇంతకీ హత్యకి గురైంది ఎవరు? అందుకు కారకులు ఎవరు?గురుశిష్యుల మధ్య సంబంధాలు అంతగా చెడేందుకు దారితీసిన పరిస్థితులు ఎలాంటివి? సినిమా పూర్తయిందా లేదా? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవల్సిందే.